అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ దేశానికి ఆదర్శమని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ కొనియాడారు. గ్రామ సచివాలయ వ్యవస్థపై బుధవారం అసెంబ్లీలో జరిగిన చర్చపై ఆయన మాట్లాడారు. స్థానికంగా ప్రజల సమస్యలు తీర్చేందుకే గ్రామసచివాలయాలను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో గ్రామస్థాయిలోనే ప్రజల సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా 14శాఖల అధికారులు గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉంటారని, ఎప్పుడూ ఏ సమస్య వచ్చినా ప్రజలు వారికి విన్నవించుకోవచ్చునని తెలిపారు.
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజల వద్దకే పాలన వస్తుందన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా అట్టడుగు పల్లెలకు సైతం సీఎం వైఎస్ జగన్ పరిపాలనను తీసుకెళ్లారని కొనియాడారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. స్థానికంగా అందుబాటులో ఉండి ప్రజల సమస్యలన్నింటినీ గ్రామసచివాలయాలు పరిష్కరిస్తామని, ఈ వ్యవస్థ ద్వారా మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్యాన్ని సీఎం వైఎస్ జగన్ సాకారం చేశారని కొనియాడారు.
రైల్వేకోడూర్ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ.. గత చంద్రబాబు సర్కార్ పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు 34 రకాల సేవలు అందుతున్నాయని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను కూడా సరిదిద్దుతూ ముందుకెళ్తున్నామని చెప్పారు. కులమతాలకు అతీతంగా ప్రజలందిరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నట్టు కోరుముట్ల శ్రీనివాసులు తెలిపారు.