హాఫ్‌ కరోనా! ఇదెక్కడిది? స్పందించిన గుత్తా

హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ సమయంలో విద్యావంతులే రోడ్లపై జాగింగ్‌ చేయడాన్ని ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణ గుత్తా జ్వాల తప్పుబట్టారు. అంతేకాకుండా లాక్‌డౌన్‌ సక్రమంగా పాటించని అలాంటి వారే కరోనా వైరస్‌ వ్యాప్తికి ఓ వర్గం కారణమంటూ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత కొద్ది రోజులుగా తనను ‘హాఫ్‌ కరోనా’ అని కొందరు అనడం జాత్యహంకార చర్యగా అభివర్ణించారు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో సోషల్‌ మీడియాలో తనను హాఫ్‌ కరోనా అని పేర్కొనడం, గతంలో ఈశాన్య రాష్ట్ర ప్రజలపై జాత్యహంకార దాడులు జరగడం వంటి విషయాలపై ఆమె స్పందించారు.   


‘నేను సోషల్‌ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉంటాను. ఈ క్రమంలో గతంలో ఈశాన్య రాష్ట్రానికి చెందని ఓ అమ్మాయిపై ఉమ్మేశారు. ఆ వీడియో వైరల్‌ అయింది. దీంతో నేను వెంటనే దేశంలో జాత్యహంకారం పెరిగిపోయిందని కామెంట్‌ చేశా.  ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రారంభమయ్యాక తనను కొందరు నెటిజన్లు హాప్‌ కరోనా, చైనాకా మాల్‌, హాఫ్‌ చైనీస్‌, చింకీ అని పిలవడం ప్రారంభించారు. ఎందుకుంటే నా తల్లి చైనా దేశస్థురాలు కాగా నా తండ్రి తెలుగువాడు. దీంతో నన్ను హాఫ్‌ కరోనా అని అంటున్నారు. ఇది కూడా జాత్యహంకారమే కదా.